ఆస్ట్రేలియాలో విషాదం చోటుచేసుకుంది.. ఇద్దరు తెలుగు యువకులు జలపాతంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. జలపాతంలోకి జారిపడిన తోటి స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరూ చనిపోవడం విషాదాన్ని నింపింది. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరిలో ఒకరు బాపట్ల జిల్లాలకు చెందిన వారు కాగా, మరొకరు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన యువకుడు. ఈ ఘటనతో ఇద్దరు యువకుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే ఉంటున్న ఇద్దరు తెలుగు యువకుల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి జలపాతం దగ్గరకు విహార యాత్రకు వెళ్లగా.. అక్కడ జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా కందుకూరు వరపర్లవారిపాలేనికి చెందిన ముప్పరాజు రామారావు, రమాదేవి కుమారుడు చైతన్య గుంటూరులో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు.. చదువు పూర్తైన తర్వాత అక్కడే ఉద్యోగం వచ్చింది. చైతన్య వృత్తిరీత్యా అక్కడే స్థిరపడ్డారు. చైతన్యకు గతేడాది గుంటూరుకు చెందిన యువతితో వివాహంకాగా.. ఆస్ట్రేలియాలోనే నివాసం ఉంటున్నారు.
కొద్దిరోజుల క్రితం చైతన్య భార్య కుటుంబానికి సంబంధించిన పనులు ఉండటంతో సొంత ఊరికి వెళ్లారు. మంగళవారం ఉదయం చైతన్య స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. చైతన్యతో పాటు బాపట్ల ప్రాంతానికి చెందిన బొబ్బ సూర్యతేజ, మరో స్నేహితుడితో కలిసి నార్త్ క్వీన్స్‌లాండ్‌లోని మిల్లా మిల్లా జలపాతం దగ్గరకు సరదాగా వెళ్లారు. అక్కడ సూర్యతేజ ప్రమాదవశాత్తూ జలపాతంలోకి జారిపడటంతో.. ఆయన్ను కాపాడేందుకు చైతన్య దిగారు. అయితే ఇద్దరూ ప్రమాదవశాత్తు నీళ్లలో కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.