తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జులై 18వ తేదీ నుంచి రైతు రుణమాఫీ పథకం అమలు ప్రక్రియను ప్రారంభించనుంది. మొదటగా రైతుల అకౌంట్లలో లక్ష రూపాయలు జమ చేయనున్నారు. జులై 18న సాయంత్రంలోపు అకౌంట్లలో డబ్బులు జమవనున్నాయి. మరోవైపు.. రుణమాపీకి రేషన్ కార్డు తప్పనిసరి అన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డే ప్రామాణికమని మార్గదర్శకాల్లో పేర్కొనగా.. రైతుల్లో ఏర్పడిన గందరగోళానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. రేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసమేని స్పష్టం చేశారు. పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్ధిదారులు 40 లక్షల మంది ఉన్నారని.. అందులో కేవలం 6 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవని మంత్రి పేర్కొన్నారు.
రుణమాఫీ పథకం పూర్తిగా అమలు చేసేందుకు మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ నెల 18 తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టి విడతల వారీగా ఆగస్ట్ 15ల తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. 18 రోజున లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో… ఒక్కో రైతు అకౌంట్లో 18 వ తేదీన లక్ష రూపాయలు జమకానున్నాయి.
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగించనున్నట్టు స్పష్టం చేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ పథకం అమలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మరోవైరు.. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 18 తేదీన సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు కూడా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.