AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయండి..

ముఖ్యమంత్రి రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సత్తా ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరిచ్చిన జాబ్‌ క్యాలెండర్‌లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని అన్నారు.

అవమానించడం తగదు..
మోతీలాల్‌ అనే వ్యక్తి ఉద్యోగాలకే రాస్తలేడు.. ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని అవమానించేలా గ్రూప్‌కు ప్రిపేర్‌ అవుతున్న వ్యక్తిని అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని కేటీఆర్‌ అన్నారు. ఏ కోచింగ్‌ సెంటర్లను అయితే ఆలంబనగా చేసుకుని నువ్వు, మీ రాహుల్‌గాంధీ వెళ్లి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో.. ఆ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులను అవమానించేలా వందల కోట్లు సంపాదించుకునేందుకు పరీక్షలు వాయిదా వేయాలని మాట్లాడటం కరెక్ట్‌ కాదని హితవు పలికారు. అందుకే తెలంగాణ యువత భగ్గుమంటున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అయితే రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తుందని ఎన్నో ఆశలతో ఏ యువత అయితే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో.. అదే యువత నిన్ను ప్రశ్నిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయ్యి ఎనిమిదో నెలలలోకి అడుగుపెట్టిందని కేటీఆర్‌ అన్నారు. ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని.. మిగతా 4 నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఎట్ల ఇస్తుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నెలబెట్టుకునేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. శాసనసభలో.. ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ఏ నిరుద్యోగుల్ని అయితే మోసం చేశావో.. వాళ్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10