AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బుల్లెట్‌ నా కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది: డొనాల్డ్‌ ట్రంప్‌

పెన్సిల్వేనియా: అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదని యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. దుండగుల కాల్పుల్లో తన కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లిందని చెప్పారు. కాల్పుల శబ్దం వినగానే ఏదో తేడాగా ఉందని అర్ధమైందన్నారు. బుల్లెట్‌ తన చెవిని తాకుతూ దూసుకెళ్లిందని, దీంతో తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు.

వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గాడ్‌ బ్లెస్‌ అమెరికా అంటూ తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి ట్రూత్‌ సోషల్‌ సైట్‌లో వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్‌ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ఆయన స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా చేరారు.

వేదిక పైనుంచి దించి దవాఖానకు తరలించారు. అనంతరం స్టేజీ పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చారు. ప్రస్తుతం ట్రంప్‌ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10