అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రంప్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది.. కాల్పులు జరిపిన ఒక దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెన్సిల్వేనియాలో తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో.. అక్కడ ఉన్న వారిలో ఉన్న దుండగులు.. ఒక్కసారిగా ట్రంప్‌పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవికి గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన ప్రసంగిస్తూనే వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో మెరుపు వేగంతో స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను కింది నుంచిపైకి లేపి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే ఒక దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారు.
ఈ ఘటనలో ట్రంప్ గాయపడటంతో వెంటనే ఆయనను సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక దుండగుల్లో ఒకరిని కాల్చి చంపగా.. మరోవ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. మరోవైపు.. కాల్పుల తర్వాత పైకి లేచిన ట్రంప్ ‘ఫైట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.