జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. అది కూడా యూపీఎస్సీ తరహాలో తీసుకురానున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్దత కల్పిస్తామన్నారు. మార్చి నెలాఖరులోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది.. మార్చి 31 వరకు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి.. డిసెంబర్ లోపల అన్ని ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ తీసుకురావటమే కాకుండా.. దానికి చట్టబద్ధత కల్పిస్తున్నామని వివరించారు.
ఇదిలా ఉంటే.. గ్రూప్-1 మెయిన్స్ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే.. 1: 50 నిష్పత్తిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పుడు కొందరు 1:100 నిష్పత్తిలో పిలవాలని కోరుతున్నారని.. అలా పిలిస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే.. అలా పిలిచిన మరుక్షణమే.. కోర్టు ఆ ప్రక్రియను ఆపేస్తుందని వివరించారు. దాని వల్ల మళ్లీ మొదటికి వస్తుందని.. 2011లో మొదలుపెట్టిన గ్రూప్-1 పరీక్షలను 2024లో కూడా పూర్తి చేసుకోలేమని పేర్కొన్నారు.
మరోవైపు.. పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్‌లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్‌లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్పా.. వారిలో పనితనం ఉండట్లేదని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీపడే విదంగా టెక్నికల్ కోర్సుల సిలబస్ మారాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని.. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే తమ ప్రభుత్వ విధానమని రేవంత్ రెడ్డి వివరించారు.