AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ సీఎం జగన్‌పై కేసు.. గుంటూరు ఎస్పీకి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

(అమ్మన్యూస్, అమరావతి):
మాజీ ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనపై గత ప్రభుత్వ హయాంలో కస్టోడియల్‌ టార్చర్‌ పెట్టి చిత్రహింసలకు గురిచేశారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో తనపై కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే జగన్‌ సర్కార్‌ కేసు రాజద్రోహం కేసు పెట్టి సెల్‌ లో వేసి చిత్ర హింసలకు గురిచేశారని పైగా తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే దర్యాప్తు ముమ్మరం చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగానే మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జగన్‌ పై కేసు నమోదైంది.

ఏ3 గా జగన్‌..
ఇందుకు సంబంధించి వైఎస్‌ జగన్‌ను ఏ3 నిందితుడిగా పోలీసులు కేసును ఫైల్‌ చేశారు. ఏ 1 గా మాజీ సీఐడీ, డీజీ సునీల్‌ కుమార్, ఏ2 గా ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు, ఏ 4 గా విజయపాల్, ఏ 5 గా డాక్టర్‌ ప్రభావతిలను చేర్చడం జరిగింది. వీరందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా మరికొందరి పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌ లో ఉండటం గమనార్హం. నాటి జగన్‌ సర్కార్‌ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై కక్ష కట్టిందని ఆరోపించారు. 2021 మే 14 న తనపై రాజద్రోహం కేసు పెట్టి బలవంతంగా జైలులో పెట్టారని..ఆ రాత్రి జైలులో నరకమంటే ఏమిటో పోలీసులు చూపించారని అన్నారు.

ఖండించిన వైసీపీ నేతలు
జగన్‌ పై కేసు పెట్టడాన్ని వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తమ నేతపై ఇలాంటి చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. జనగన్న కోసం అవసరమైతే ఉద్యమిస్తామని అన్నారు. ఈ విషయంలో మాజీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. దేశ సర్వోత్తమ న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో రఘురామ కృష్ణరాజు కేసు నడిచింది. స్వయంగా సుప్రీం కోర్టులో తిరస్కరించారు ఈ కేసును. అలాంటిది మళ్లీ కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడం ఏమిటని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేయడమే ఇది అని ఆయన తీవ్రస్థాయిలో టీడీపీ సర్కార్‌ పై విమర్శలు గుప్పించారు.

ANN TOP 10