అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. ఇవాళ ముంబైలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట చిన్ననాటి స్నేహితులు. అనంత్ అంబానీ… ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ.. కుమారుడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరు రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ జంట తమ సంబంధాన్ని వెలుగులోకి తీసుకురాకపోయినప్పటికీ, రాధిక తరచుగా అంబానీ కుటుంబంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. 2018లో జరిగిన ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీ వివాహానికి, 2019లో శ్లోకా మెహతాతో ఆకాష్ అంబానీ వివాహానికి ఆమె హాజరయ్యారు.
డిసెంబర్ 2022లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో రాధిక , అనంత్‌ల రోకా వేడుకను నిర్వహించారు. అనంత్ రాధికల గోల్ ధన వేడుక జనవరి 19, 2023న జరిగింది. నిశ్చితార్థ వేడుక అంబానీ నివాసంలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరై దంపతులను ఆశీర్వదించారు. వీరిలో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, శ్రేయా ఘోషల్, రాజ్‌కుమార్ హిరానీ విధు వినోద్ చోప్రా ఉన్నారు.
ఇక పెళ్లి వేడుకకు కూడా అతిరథ మహారథులు తరలివస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ముంబైకు చేరుకున్నారు. సినీ ప్రముఖులైన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, రామ్ చరణ్ ముంబై చోరుకోగా.. UK మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, శాంసంగ్ సీఈఓ హాన్ జోంగ్-హీ ఇతర ప్రముఖ అతిథులు ఇప్పటికే మూడు రోజుల మెగా వేడుక కోసం ముంబై చేరుకున్నారు. ఇప్పటికే ఈ పెళ్లికి వచ్చే అతిథులతో ముంబై నగరం అంతా కోలాహలంగా మారింది. ఈ పెళ్లిలో ఇవాళ ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి.