హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మెట్రో స్టేషన్ కింద ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ పక్కనే తపాడియా ఆస్పత్రి ఉండటంతో ఆస్పత్రి వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అక్కడి నుంచి బయటికి తరలించారు.
ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు.. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను మొత్తం ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఫర్నీచర్ షోరూం ఉండగా.. అందులోకి కూడా మంటలు వ్యాపించడంతో.. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంటలు, దట్టమైన పొగతో అలుముకుంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
శ్రీ దత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆ మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఎగిసిపడిన లమంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఆ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయించిన పోలీసులు.. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. చాలా సేపు కష్టపడిన తర్వాత ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు.