వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వన మహోత్సవం, మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, వ్యవసాయ సంబంధిత అంశాలు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్, సెర్ప్ సీఈఓ దివ్య, మున్సిపల్ శాఖ డైరెక్టర్ గౌతమ్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ. కోటి ఆర్థిక సహాయం
రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్న నిర్ణయం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. స్వయం సహాయక బృందాలలో ఇప్పటికీ చేరని మహిళలందందరినీ చేర్పించాలని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ల తయారీ పనులను సకాలం లో పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. రెండో సెట్ యూనిఫామ్ ల పనులను కూడా త్వరలోనే పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్ ల ఏర్పాటు ను త్వరితగతిన ప్రారంభమయ్యేలా చొరవ చూపించాలన్నారు. ఇంకా అసంపూర్తిగా గా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.