ఉచితం అనే పదం పోవాలని, దీనిని ప్రజలకు రాజకీయ పార్టీలే అలవాటు చేశాయని, ఇప్పుడు గ్రహపాటుగా అయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘‘ఉచిత కరెంటు అంటారు.. ఆ తర్వాత నో కరెంటు అంటారు. నేను ఒక రాజకీయ పార్టీ నో, ఏ వ్యక్తి నో అనడం లేదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలే తప్ప ఉచితాలు కావు. పార్టీలు పోటీలు పడి.. ప్రజలకు ఉచితాలను ప్రకటిస్తున్నాయి. రాజకీయ పార్టీలలో మార్పు వస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని ఉచితం సాధ్యం కాదని, మాటలు మాత్రమే ఉచితం అని గ్రహించాలని అన్నారు. ‘కనక మహాలక్ష్మి బ్యాంక్ రజతోత్సవం వేడుక’లో ఉచిత పథకాలు, రాజధానితో పాటు పలు అంశాలపై వెంకయ్య నాయుడు మాట్లాడారు.
రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ, ఉత్తరాంధ్ర వాసులు ఎంతో మంచి వారని, రాజధాని వస్తే చెడిపోయేవారేమోనని వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖకు రాజధాని వస్తుందేమోనని భయపడ్డట్టు వెల్లడించారు. విశాఖ రాజధాని వద్దంటూ విశాఖ వాసే ఒకరు తనతో చెప్పారని, ఎందుకని అడిగితే ప్రశాంతత కావాలని చెప్పారని వివరించారు. రాజధాని పరిపాలనకు కేంద్రంగా ఉండాలని, రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నానంటూనే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక తెలుగు భాషపై మాట్లాడుతూ.. మాతృ భాషకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఇవ్వాలని అన్నారు. అప్పుడే ప్రభుత్వ విధివిధానాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. సహకార వ్యవస్థపై స్పందిస్తూ.. ప్రజలకు సులభంగా సరళంగా రుణాలు ఇస్తే అంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏవి పడితే వాటిని తాకట్టు పెడితే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, ఈ ట్రెండ్ మంచిది కాదని హెచ్చరించారు. సహకార వ్యవస్థ బాగుపడాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదని, ఎన్నికలు సక్రమంగా జరగాలని సూచించారు.