AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

– తరలివచ్చిన భక్తజనం
– పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. మంగళవారం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున స్వామి, అమ్మవార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కిషన్‌రెడ్డి పూజలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. కాగా, మూడు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవానికి సోమవారం ఉదయం నిర్వహించిన గణపతి పూజతో కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక కల్యాణానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

భూమికి 10 అడుగుల దిగువన..
భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి. ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలసినట్టు చెబుతారు.

ANN TOP 10