వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 12 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్లా తేలికపాటి వర్షాలు కురిస్తాయని వెల్లడించింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు సంగారెడ్డి, మెదక్, కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వివరించింది.