భువనేశ్వర్: జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ సత్సంగ్ యాత్ర తొక్కిసలాట ఘటన మరువక ముందే.. జగన్నాథుడి రథ యాత్రలో తొక్కిసలాట జరిగింది.
ఆదివారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు బలభద్రుడి రథం తలదర్వాజ లాగుతుండగా బడా దండ ప్రాంతానికి రాగానే భక్తులు ఒక్కసారిగా జగన్నాథుడ్ని చూడటానికి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట అయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 400 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్నాథ దేవాలయం నుండి 2.5 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయం వైపు వేలాది మంది భక్తులు రథాలను ముందుకు లాగడానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.