– పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
– మేయర్ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టు
– పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపాటు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శనివారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది.
శాంతించని సభ్యులు..
కార్పొరేటర్లను తమ స్థానాల్లో కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. బీఆర్‌ఎస్ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె తన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
కాగా, ఇనాళ్లు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన మేయర్, డిప్యూటీ మేయర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. వారితోపాటు పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో సభలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగ్‌లు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్‌ఎస్ బలంగా ఉంది.
150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా, మేయర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నది.