AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోఠి డీఎంఈ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి

హైదరాబాద్‌ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్లు దాడికి దిగారు. దీంతో డీఎంఈ కార్యాలయం ఎదుటే బాధిత డాక్టర్‌ శేఖర్‌ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ బదిలీలను అడ్డుకునేందుకు పలువురు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌ సిటీలోనే తిష్ట వేశారని.. వాటిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని తెలిపారు.

సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని బాధిత డాక్టర్‌ శేఖర్‌ తెలిపారు. ఈ జీవో అమలు చేస్తే 40 శాతం మేర హైదరాబాద్ సిటీలో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వైద్యులు హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ బదిలీలను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేశ్‌, రాథోడ్ , వినోద్ కుమార్ లు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

డీఎంఈకి వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని దాడి చేశారని డాక్టర్‌ శేఖర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో వీరు ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీలోనే తిష్ట వేశారని ఆరోపించారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దాడి చేసిన నలుగురు వైద్యులపై సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ANN TOP 10