AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. ఖాయమైన పదవి..?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గం చేపట్టింది. డిప్యూటీ సీఎం గా ఎస్సీకి అవకాశం కల్పించారు. దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బీసీల్లో బలంగా సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. పీసీసీ పదవికి బీసీ ఇవ్వాలనకుంటే మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఎస్సీకి ఇవ్వాలనుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరును ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఎస్టీకి ఇవ్వాలనకుంటే బలరామ్ నాయక్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

బీసీకి పీసీసీ పదవి ఇస్తే ఎస్టీ లంబాడకు చీఫ్ విప్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్​ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇసారి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.

ANN TOP 10