న్యూఢిల్లీ: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతోపాటు పోస్టర్లు కూడా అతికించారు. అందులో భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలు రాసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. నేమ్‌ప్లేట్‌పై ఉన్న ఇంకును తుడిచివేశారు. పోస్టర్లను తొలగించారు. కాగా, దాడి విషయాన్ని ఎంపీ ఒవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేది లేదని చెప్పారు. ఢిల్లీలోని నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో లెక్కేలేదన్నారు. ఇది ఎలా జరుగుతుందని ఢిల్లీ పోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. ఎంపీల భద్రతకు సంబంధించి ఏం హామీ ఇస్తారో చెప్పాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఇలాంటివి తనను భయపెట్టవని, పిరికి చర్యలను ఆపాలని స్పష్టం చేశారు.