కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారులు, ప్రాజెక్టుల విషయంపై ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గట్కరీతో చర్చించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులకు సంబంధించి గత ఐదేళ్లలో రాష్ట్రానికి అతి తక్కువ నిధులు వచ్చాయని అన్నారు. భూ సమీకరణ, ఇతర అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ అసమర్థత వల్లే అనేక పనులు ఆగిపోయాయని తెలిపారు. 2016లో ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డును కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించామని అన్నారు. 50-50 షేరింగ్‌లో భూ సమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే 6 లేన్‌ల గురించి చర్చించినట్లు వెల్లడించారు. రెండేళ్ల లోపే విజయవాడ – హైదరాబాద్ మార్గాన్ని రూ.4 వేల కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఏపీ విభసన చట్టం ప్రకారం గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అన్ని వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ సాధించడమే లక్ష్యం అని అన్నారు. ఉప్పల్-ఘట్‌కేసర్ హైవే విస్తరణ పనులు నత్తనడక సాగుతుండటంతో వాటి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కోమటి రెడ్డి వెల్లడించారు.