(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఫోన్ చేసినట్లు సమాచారం. జగిత్యాల
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కినుక వహించిన జీవన్‌రెడ్డికి ఢిల్లీ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏకంగా పార్టీ అగ్ర నాయకురాలే ఆయనకు ఫోన్ చేశారట. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.
జీవన్‌రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్‌ను కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ వైఖరిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టారని, ఇప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఇన్నేళ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని అన్నారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.