అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పోరాడేందుకు లోక్‌సభలో విపక్ష నేతగా బాధ్యతలు చేపడతానని రాహుల్ గాంధీ తెలిపారు. ఇంతకుముందే లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ నిర్ణయాన్ని లోక్ సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరికి లేఖ ద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ తెలిపినట్లు సమాచారం. 18వ లోక్ సభ తొలి సమావేశాల్లో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ విపక్ష నేతగా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
లోక్ సభ స్పీకర్ పదవికి ఏకాభిప్రాయంతో ఎన్నిక జరుగడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్ష నేతకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు. కానీ విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను అధికార ఎన్డీఏ కూటమి తిరస్కరించడంతో స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది. బీజేపీ నుంచి మాజీ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ పార్టీ నుంచి కే సురేశ్ స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. బుధవారం లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతాయి. దశాబ్దాలుగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుండటం ఇదే తొలిసారి. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతుతోపాటు వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నలుగురు కూడా మద్దతు పలికారు.