ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని వైసీపీని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు జగన్. అప్పుడు చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని.. జరగబోయేది ఇదేనని అన్నారు.
వైసీపీ నేతలతో జగన్ ఏమన్నారంటే..
‘2029లో వైసీపీనే వస్తుంది. 2029 నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారు. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మళ్లీ మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ సమయంలో చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ వస్తుందనేది వాస్తవం. మనం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. ప్రజలకు తోడుగా ఉండేలా, వారికి మద్దతుగా పోరాటం చేసే కార్యక్రమాలు చేస్తాం. మనకి వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. స్పీకర్ పదవి తీసుకునే వ్యక్తి సిగ్గులేకుండా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్ ఓడిపోయాడు.. ఇంకా చావలేదు అని ఒకరు అంటారు. మరొకరు చచ్చే వరకు జగన్ను కొట్టండని అంటారు. ఇలాంటి వ్యక్తి రేపు స్పీకర్ అవుతారట. మనం ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి వెళ్లబోతున్నాం. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం మాత్రం నాకు లేదు. మనం ప్రజలతో కలిసి పోరాటం చేసే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. జగన్ పాలనలో కులం, మతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారో కూడా చూడలేదు. నేడు కేవలం వారి పార్టీకి ఓటు వేయలేదనే కారణంతో కొడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనేక గ్రామాలలో ఇదే విధంగా చేస్తున్నారంటే.. వారి పాపాలు పండే సమయం త్వరలోనే వస్తుంది’ అని జగన్ అన్నారు.