AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇంటిలోనూ తనిఖీలు
నిజాంపేటలోని అల్లుడి ఇంట్లోనూ..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్‌చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పటాన్‌చెరులోని మూడు ప్రాంతాలతోపాటు నిజాంపేటలోని మహిపాల్‌రెడ్డి బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గూడెం మహిపాల్‌ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓ కేసులో మహిపాల్‌ రెడ్డి సోదరుడు గూడెం మధు అరెస్ట్‌ కాగా ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

నిజాంపేటలో..
హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అల్లుడి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో గూడెం మహిపాల్‌ రెడ్డి సోదరుల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు మహిపాల్‌ రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు కేంద్రబలగాలతో భద్రత ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా మహిపాల్‌ రెడ్డి అల్లుడు తాజాగా రూ.3కోట్ల ఖరీదైన విలాసవంతమైన కారు కొన్నట్లు సమాచారం.

ANN TOP 10