AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ జనంలోకి జగన్.. ఓదార్పు యాత్ర తరహాలో కొత్త ప్లాన్..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ తమదే అధికారమనే ధీమాలో ఉన్న వైసీపీ పార్టీ, ఆ పార్టీ అభిమానులు.. ఈ ఫలితాలతో ఒక్కసారిగా కుంగిపోయారు. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత పలుచోట్ల వైసీపీ కార్యకర్తల మీద పలుచోట్ల దాడులు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నష్టపోయిన కార్యకర్తలను పరామర్శించేందుకు మరోసారి ఓదార్పుయాత్ర చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అందని ఫలితమిది. అధికార వైసీపీ ఘోర ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో ఘనవిజయం సాధించి యావత్ దేశాన్ని నివ్వెర పరిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైంది. వైసీపీకి గట్టి పట్టు ఉందని భావించిన రాయలసీమలోనూ ఫ్యాన్ పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు గానూ.. 49 చోట్ల ఘన విజయం సాధించిన వైసీపీ.. ఈసారి కేవలం 7 సీట్లకే పరిమితమైంది.

అందులోనూ వైఎస్ కుటుంబం అడ్డాగా పేరుగాంచిన ఉమ్మడి కడప జిల్లాల్లోనూ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మునుపెన్నడూ లేని విధంగా కడప జిల్లాలో టీడీపీ ఏకంగా ఐదుచోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ రేంజులో ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలను, ఇతర కీలక నేతలను కలిసి వారి అభిప్రాయాలను సైతం తెలుసుకున్నారు. ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కడం ద్వారా ప్రతి ఇంటికీ డీబీటీతో సంక్షేమాన్ని అందించినప్పటికీ.. ఘోర ఓటమికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ స్థాయిలో వ్యతిరేకతను ఊహించలేకపోయామని తనను కలిసిన నేతల వద్ద జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఇదే సమయంలో ఓటమితో కుంగిపోయిన వైసీపీ శ్రేణులను ఉత్తేజపరచడానికి, వారిలో ఉత్సాహం నింపడానికి వైఎస్ జగన్ మరో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇక కౌంటింగ్‌లో టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత పలుచోట్ల వైసీపీ శ్రేణుల మీద, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులకు అండగా నిలబడాలని జగన్ నిర్ణయించుకున్నారు.

మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలోనూ జగన్ ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. టీడీపీ దాడిని కలిసి కట్టుగా ఎదుర్కోవాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. అలాగే మీరంతా జట్టుగా నిలబడి, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు జగన్. నష్టపోయిన కార్యకర్తలను తాను పరామర్శిస్తానని.. వారిలో భరోసా కల్పిస్తానని జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో వైసీపీ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు, వైసీపీ శ్రేణులలో ఉత్తేజం తెచ్చేందుకు వైఎస్ జగన్ మరోసారి యాత్ర చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

ANN TOP 10