తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావుకు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా.. శ్రవణ్ కుమార్ లండన్‌లో ఉన్నారు. ఫోన్ ట్యాపింక్ కేసులో వీళ్లింద్దరూ.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే విదేశాలకు వెళ్లినట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసందే. దీంతో వీరిని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. మొదట లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
కాగా.. ఇప్పుడు పోలీసులు ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా నాంపల్లి కోర్టులో సీఐడీ అధికారులు నిన్ననే ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉంది.
తాజాగా పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 10వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి.. విచారించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం ఆరుగురిని చేర్చినట్లు పేర్కొన్నారు.