తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కాగా, మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్, కూకట్ పల్లి, చందానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్బీనగర్, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. కురిసిన కుండపోత వర్షానికి వాహనదారులు తడిసిముద్దయ్యారు. రోడ్లపైకి వరదనీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. వాన దంచికొట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. కాగా, ఉప్పల్ మెట్రో స్టేషన్లో వర్షం నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావాడంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా నిజాంపేటలో పిడుగుపాటుతో 12 గొర్రెలు మృతి చెందాయి.
ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా.. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.