AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీయేకు సుప్రీం నోటీసులు.. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అంశం..

పరీక్షను రద్దు చేయాల్సిందేనంటూ పలువురు కోర్టుకు
కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
నీట్‌ యూజీ పరీక్ష –2024 పేపర్‌ లీక్‌ అంశం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ పేపర్‌ లీక్‌ అంశం సుప్రీం కోర్టుకెక్కింది. 2024 నీట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని సంపద్రించారు. ఈ కేసును విక్రమ్‌ నాథ్, సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం ఈ కేసును విచారించింది. విచారణ తర్వాత సుప్రీం కోర్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అయితే పలువురు కౌన్సెలింగ్‌ మీద స్టే విధించాలని కోరగా సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది.

మే 5వ తేదీన నిర్వహించిన మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్‌–యూజీలో రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు టాప్‌ ర్యాంకు సాధించారు. వీరిలో ఒకే సెంటర్‌ నుంచి ఆరుగురు విద్యార్థులు ఉండటంతో అనుమానాలకు దారి తీసింది.

నీట్‌–యూజీ మెడికల్‌ ప్రవేశ పరీక్షలో 1,500 మందికి పైగా అభ్యర్థులకు లభించిన గ్రేస్‌ మార్కులను సమీక్షించడానికి విద్యా మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. పరీక్షలో 67 మంది అభ్యర్థులు మొదటి ర్యాంక్‌ను పంచుకోవడానికి దారితీసిన గ్రేస్‌ మార్కులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

మాజీ యూపీఎస్సీ ఛైర్మన్‌ నేతృత్వంలోని ప్యానెల్‌ వారంలోపు తన సిఫార్సులను సమర్పిస్తుందని.. అవసరమైతే అభ్యర్థుల ఫలితాలను సవరించవచ్చని ఎన్‌టీఏ డైరక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ గ్రేస్‌ మార్కుల అంశం పరీక్ష అర్హత ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని, అలాగే ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్‌ ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపదని సుబోధ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఇక ఈ పేపర్‌ లీక్, గ్రేస్‌ మార్కుల అంశంపై స్పందించిన ఎన్టీఏ.. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయటం, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడం హై స్కోరింగ్‌కు కారణాలుగా చెప్పుకొచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10