రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం
(అమ్మన్యూస్, అమరావతి):
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా మూడు పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని వెల్లడించారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు.
కాగా, ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలుకుతారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరువుతారు.