కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జై శంకర్‌లనే కొత్త ప్రభుత్వంలోనూ ప్రధాని మోదీ కొనసాగించారు. ఈ నలుగురు మంత్రులే ప్రధాని నేతృత్వంలో ఉండే భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖను కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన ఆరోగ్య శాఖను తిరిగి పొందారు. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ నిర్వర్తించిన మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖను అన్నపూర్ణా దేవికి ఇచ్చారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది.
తెలుగు ఎంపీలకు కీలక పదవులు
కేంద్ర క్యాబినెట్‌లో తెలుగు రాష్ర్టాల ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తెలంగాణలో ఈ హోదా దక్కిన మూడో ఎంపీ బండి సంజయ్ కావడం విశేషం. గతంలో కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులుగా పనిచేశారు. శాఖల కేటాయింపు తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిల్లో బొగ్గు పాత్ర కీలకమని, బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేస్తానని చెప్పారు. అధికారులతో చర్చించిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో ‘మిషన్ 100 డేస్ అజెండా’తో ముందుకెళ్తామన్నారు. దేశమంతా విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బొగ్గు కొరత లేకుండా విద్యుదుత్పత్తి పెంచడంపై దృష్టి సారిస్తామన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తానన్నారు.
ఏపీ నుంచి ఇద్దరు సహాయ మంత్రులు
తాజా క్యాబినెట్‌లో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు కేంద్ర క్యాబినెట్‌లో చేరిన బీజేపీ మిత్రపక్షాలపై జేడీయూ, జేడీఎస్, హెచ్‌ఏఎం, ఎల్జేపీ(రామ్ విలాస్)ల్లో పలు పార్టీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామికి కీలకమైన భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖను కేటాయించారు. ఇక జేడీయూ నేత లలన్ సింగ్‌కు పంచాయతీ రాజ్‌తో సహా పలు ఇతర శాఖలు దక్కాయి.