తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలు సాధించి మంచి జోష్‌లో ఉంది.. బీజేపీ. రాష్ట్రం నుంచి గతంలో ఒకరికే కేబినెట్ బెర్త్ లభించగా ఈ సారి ఇద్దరికి అవకాశం లభించింది. సికింద్రాబాద్‌నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన కిషన్‌రెడ్డి..మోదీ కేబినెట్లో మరోసారి బెర్త్ దక్కించుకున్నారు. గతంలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి ఒకరే ప్రాతినిధ్యం వహించగా..ఈ సారి బండి సంజయ్ కూడా జత కలిశారు. కరీంనగర్ ఎంపీగా 2019లో విజయం సాధించిన బండి సంజయ్..ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన దూకుడును చూపించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బండి సంజయ్ దూకుడే కారణమన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి..రెండోసారి ఎంపీగా గెలిచి మోదీ టీమ్‌లో చేరిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పలుమార్లు ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్న సంజయ్.. పార్టీ కోసం చేసిన సేవలు, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీకి విధేయత వంటి అంశాలు కలిసివచ్చాయి. బండి సంజయ్‌కు కేంద్రమంత్రిగా అవకాశం లభించడంతో కరీంనగర్లో కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
తెలంగాణలో గతంతో పోలిస్తే రెట్టింపు సీట్లు సాధించిన బీజేపీలో ఈ సారి కేబినెట్ బెర్త్ కోసం కూడా గట్టిపోటీ నెలకుంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, డీకే అరుణ కూడా కేంద్రమంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే మరోసారి కిషన్‌రెడ్డిని కేంద్రమంత్రిగా కంటిన్యూ చేయడంతో పాటు బండి సంజయ్‌ను కేబినెట్లోకి తీసుకోవడంపై హైకమాండ్ గట్టి కసరత్తే చేసింది. పార్టీకి తొలినుంచి విధేయులుగా ఉండడంతో పాటు రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కారణమయ్యారని బీజేపీ అధిష్ఠానం భావించింది. గత కేబినెట్లో మినిస్టర్‌గా పని చేయడంతో పాటు ఇప్పటికే నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించడం, కరోనా టైమ్‌లో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడం, అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉండటం కిషన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలుగా భావిస్తున్నారు.
ఈటల వైపే..
ఇతర పార్టీల నుంచి ఇటీవలే బీజేపీలో చేరడం ఈటల రాజేందర్, డీకే అరుణలకు మైనస్ అయినట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ అండ్ వాల్యూబుల్ నేతలుగా ఉన్న వీరిద్దరికి పార్టీ ఎలాంటి అవకాశం ఇస్తుందోనన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది. వీరిలో ఒకరికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ కు పార్టీ అధిష్టానం నుంచి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరి డీకే అరుణకు ఎలాంటి అవకాశం ఇస్తారన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ఉన్న అరుణకు మరోసారి పార్టీలోనే ప్రమోషన్ ఇస్తారా లేక మరో పదవి ఆఫర్ చేస్తారా అన్న ఆసక్తి పార్టీలో నెలకుంది.