ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు (ఆదివారం) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతో పాటు పలువురు ఎంపీలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు.
బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి లభించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని బండి సంజయ్ చెప్పారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే? :
‘‘ఈరోజు నాకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. వారందరికీ ప్రత్యేక కృతజ్ఝతలు . ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే ఈరోజు నాకు కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తా.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేదొక్కటే. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నా. అట్లాగే, తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తా’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.