కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు దక్కింది.
నరేంద్రమోదీ 2.0 క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న జీ కిషన్ రెడ్డి మినహా అందరూ తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి కరీంనగర్ స్థానం నుంచి గెలుపొందిన బండి సంజయ్ కుమార్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకే ప్రధాని మోదీ అవకాశం కల్పించారు.
2019 ఎన్నికల్లో గెలుపొందగానే తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను తప్పించి, కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్ సభా స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అచ్చెన్నాయుడు కుమారుడే రామ్మోహన్ నాయుడు.
గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌కూ సహాయ మంత్రి పదవి లభించింది. పెమ్మరాజు చంద్రశేఖర్ తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.
ఇక బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకూ సహాయ మంత్రి హోదా లభించింది. భూపతి రాజు శ్రీనివాసవర్మ కూడా పార్లమెంటుకు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.