లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాల తోపాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవమన్నారు కేటీఆర్.
ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, 2018లో 88 అసెంబ్లీ స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ప్రజా పక్షాన పోరాడేందుకు అవకాశమిచ్చారన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతామన్నారు కేటీఆర్.