అగ్రరాజ్యం అమెరికా (America)లో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు, అదృశ్యం ఘటనలు ఇటీవలే కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఏదో ఒక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి అదృశ్యమైంది.
నితీశ కందుల (Nitheesha Kandula) కాలిఫోర్నియా (California) రాష్ట్రం లాస్ ఏంజెల్స్ (Los Angeles)లోని ఎల్లెండేల్ ప్రాంతంలో నివాసం ఉంటూ.. స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. మే28వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో యువతి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న లాస్‌ఏంజెల్స్ పోలీసులు యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు. యువతి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా స్థానికులను కోరారు.