AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దశాబ్ది వేడుకలకు రండి.. గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. దీనికోసం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌తోపాటు ట్యాంక్‌బండ్‌పై ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రాజ్‌భవన్‌ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

తెలంగాణ దశాబ్ది వేడుకలను ప్రభుత్వం రెండు పూటలా నిర్వహించనుంది. జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.

జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. ఇదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా ఫైర్ వర్క్స్‌తో వేడుకలను ముగిస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10