హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చెలరేగిపోవడంతో.. ఉదయం 10 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎండలు దంచి కొడుతున్న వేళ వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నగరంలోని అన్ని మండలాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. సిటీలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
జూన్ 2న చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి తదితర మండలాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూన్ 4 వరకు ఇతర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.