టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా.. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు ఉగ్రముప్పు (Terror Threat) ఉందనే వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐఎస్-కే ఉగ్రసంస్థ ఆ రోజున ‘లోన్ వోల్ఫ్ దాడి’కి (Lone Wolf Attack) ప్లాన్ చేశాయని ఓ పోలీస్ అధికారి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
న్యూయార్క్ గవర్నర్ రియాక్షన్
ఈ బెదిరింపు వార్తలపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ (Kathy Hochul) స్పందిస్తూ.. ‘‘న్యూయార్క్ స్టేట్ పోలీస్‌కు అక్కడ నిఘా పెట్టాలని, అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి,, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పడం జరిగింది. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లను అందరూ ప్రశాంతంగా ఆస్వాదించేలా నిర్వహణ చర్యలు చేపట్టాం’’ అని తెలిపారు. ఇదే సమయంలో నసావు కౌంటీ (మ్యాచ్ జరిగే ప్రదేశం) హెడ్ బ్రూస్ బ్లేక్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని భరోసానిచ్చారు. సెక్యూరిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఐసీసీ స్పందన
ఇక ఐసీసీ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు తాము కూడా కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపింది. ప్రతి ఒక్కరి భద్రతే తమకు ముఖ్యమని, దానికోసం ప్రతిచోటా సెక్యూరిటీని నియమించామని పేర్కొంది. స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా క్షుణ్ణంగా ప్రతీది పరిశీలిస్తున్నామని వెల్లడించింది. అప్పటికప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు కూడా చేయడం జరగిందని ఐసీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా.. జూన్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే తొమ్మిది మ్యాచ్‌లకు న్యూయార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది.