జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 47 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను జీఎంసీకి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 75మందికిపైగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి అఖ్నూర్ ఉప జిల్లాసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను అక్కడి నుంచి జమ్మూ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన బస్ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి శివఖోడి ధామ్‌కు వెళ్తున్నట్లు సమాచార. శివఖోడి ధామ్ జమ్మూ డివిజన్‌లోని రియాసి జిల్లాలోని పౌనిలో ఉన్నది. కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉండడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తున్నది. బస్సు పడిపోయిన వెంటనే పెద్దఎత్తున అరుపులు, కేకలు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే సహాయ, సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని బస్సు అద్దాలు పగలగొట్టి రోడ్డుపైకి తీసుకువచ్చి సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది వరకు ఉన్నారని అక్నూర్ ఎస్‌డీఎం తెలిపారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటన తెలిసి చాలా బాధపడ్డానన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతుగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాదం తనను కలచివేసిందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.