AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ.. భగవతి అమ్మన్‌ ఆలయంలో పూజలు

చివరిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి, తెల్లని శాలువను కప్పుకున్న ప్రధాని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత వివేకానంద మెమోరియల్‌లోని ధాన్య్‌ మండపం వద్ద ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ పగలు, రాత్రి ధ్యానం చేయనున్నారు. అనేక దశాబ్దాల క్రితం. ఈ ప్రదేశంలో పార్వతీదేవి ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని ప్రతీతి.

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్‌నాథ్‌ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం వెనుక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. దశాబ్దాల కిందట స్వామి వివేకానంద భారతమాత దర్శనం పొందిన ప్రదేశం కన్యాకుమారి. ఈ ప్రాంతం స్వామి వివేకానంద జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ ఎంత ముఖ్యమైనదో.. స్వామి వివేకానంద జీవితంలో రాక్‌ మెమోరియల్‌ సైతం ప్రత్యేకమైంది.

దేశమంతా తిరుగుతూ కన్యాకుమారి చేరుకున్న స్వామి వివేకానంద ఇక్కడ మూడు రోజుల ధ్యానం చేశారు. ఇక్కడ శిలపైనే ఆయనకు జ్ఞానోదయం జరిగిందని ప్రతీతి. ఈ ప్రదేశంలో పార్వతీ దేవి శివుడి కోసం ఎదురుచూస్తూ ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని చెబుతారు. భౌగోళికంగా ఈ ప్రాంతం దక్షిణాన చివరిది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశం కూడా.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10