తెలంగాణ ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డపైనే అంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని చెప్పారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఈటల రాజేందర్, తాండ్ర వినోద్, సీతారాం నాయక్, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదన్నారు. పట్టభద్రులు చైతన్యవంతులని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారానే ప్రజాస్వామ్య విలువ పెరుగుతుందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.
