విద్యార్థులకు సమస్యలు సృష్టించింది బీఆర్‌ఎస్సే
కోడ్ ముగియగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ విద్యార్థులకు సమస్యలు సృష్టించిందే మాజీ మంత్రి కేటీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. తాను విద్యార్థుల నుంచి వచ్చానని. విద్యార్థుల సమస్యలన్నీ తనకు తెలుసునని తెలిపారు. పదేళ్ల కాలంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే అనేక నిర్ణయాలను కేటీఆర్ తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ… విద్యార్థులపై వ్యంగ్యంగా, హేళనగా కేటీఆర్ మాట్లాడలేదా అని ప్రశ్నించారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్ణయాల వల్ల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతే కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చిందని ఉద్ఘాటించారు. విద్యార్థుల మధ్య కొట్లాట పెట్టి కేటీఆర్ తమాషా చూశారని ధ్వజమెత్తారు. జీఓ 46 పైన కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. జీఓ 46, 317పై ప్రభుత్వం నిపుణులతో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్నికల కోడ్ అయిపోగానే జీవో 46, జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ క్యాలెండర్ తప్పకుండా ప్రకటిస్తామని బల్మూర్ వెంకట్ హామీ ఇచ్చారు.