కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని… అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు. కోర్ట్ కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని ప్రశ్నించారు. మోదీ కాల గర్భంలో కలిసిపోతారని శాపనార్థాలు పెట్టారు. రాహుల్‌కు తాము అంతా అండగా ఉంటామని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని.. దాన్ని మోడీ జీర్నుంచుకోలేకపోతున్నారన్నారు. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.