AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్, ఆర్‌ఎస్పీ‌వి అర్థంపర్థం లేని ఆరోపణలు: మంత్రి జూపల్లి

చావును కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేత శ్రీధర్ హత్యకు తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్య అంశంపై బీఆర్‌ఎస్ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని, ఆయన అనేక వివాదాల్లో ప్రమేయం ఉందన్నారు. అడ్డగోలు ఆరోపణలు మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. చనిపోయిన శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదని, ఆయన హత్య బాధాకరమని అన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో తనపై ఆరోపణలు చేశాడని కేటీఆర్‌‌పై మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం తనపై నిందలు వేస్తున్నారని, శ్రీధర్ రెడ్డి ఎలాంటోడో ఊరికి వెళ్లి అడగండన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. మొన్నటి వరకు కేసీఆర్‌ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్‌ను పంచన చేరారని ఆగ్రహించారు. బీఆర్‌ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్యపై సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణకు సిద్ధమని ప్రకటించారు.

అక్కసుతోనే జూపల్లిపై ఆరోపణలు: మల్లురవి

గతంలో కూడా తమ పార్టీ కార్యకర్తలు మరణించారని, ఆ సమయంలో తాను ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. హత్యలకు రాజకీయాలను ముడిపెట్టడం సరికాదన్నారు. శ్రీధర్ రెడ్డికి కుటుంబంతో ఆయనకు తగాదాలు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ప్రవీణ్ కుమార్, కేటీఆర్‌లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఎఫెక్ట్‌ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోలేదన్నారు. శ్రీధర్ హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారని స్పష్టం చేశారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంత్రి జూపల్లిపై అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. జూపల్లి కృష్ణారావుది హత్యారాజకీయాలు చేసే వ్యక్తి కాదని అన్నారు. హంతకులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మల్లురవి పేర్కొన్నారు.

ANN TOP 10