AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రివ‌ర్గం నుంచి జూప‌ల్లిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి : కేటీఆర్

హ‌త్యా రాజ‌కీయాలు తెలంగాణ‌కు మంచిది కాద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు నెల‌ల కాలంలోనే ఇద్ద‌రి హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన మంత్రి జూప‌ల్లి కృష్ణారావును మంత్రివ‌ర్గం నుంచి స‌స్పెండ్ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మీప‌ల్లిలో బొడ్డు శ్రీధ‌ర్ రెడ్డి అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్న సంద‌ర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు జూప‌ల్లి కృష్ణారావే బాధ్య‌త వ‌హించాలి. ఇది మొద‌టి హ‌త్య కాదు. పేరుకేమో ప్ర‌జాపాల‌న.. చేస్తున్న‌ది ప్రతీకార పాల‌న‌. ప్ర‌తీకారంతో ర‌గిలిపోతూ ఎన్నిక‌ల్లో వ‌త్తాసు ప‌ల‌క‌ని వారి మీద‌ ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాల‌న‌.. ఇది కాంగ్రెస్ పాల‌న‌. ఈ హ‌త్యకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి. రాష్ట్రంలో ఎక్క‌డా లేని ఫ్యాక్ష‌న్ సంస్కృతిని మంత్రి జూప‌ల్లి కొల్లాపూర్‌లో తీసుకొచ్చారు. జ‌న‌వ‌రిలో మల్లేష్ యాద‌వ్‌, ఇప్పుడు శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యారు జూప‌ల్లి. ఒక‌టే నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండు హ‌త్యలు జ‌రిగాయంటే మంత్రి ప్ర‌మేయం, ప్రోద్బ‌లం లేకుండా ఆయ‌న అనుచ‌రులు ఇంత దారుణాల‌కు తెగ‌బ‌డ‌రు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి చిత్త‌శుద్ధి ఉంటే మంత్రి జూప‌ల్లిని మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు గురైన‌ట్టు ఉద‌యం 5.30కు పోలీసుల‌కు ఫోన్ చేస్తే గంట‌న్న‌ర త‌ర్వాత వ‌చ్చి ప్రేక్ష‌క‌పాత్ర పోషించారు. ఈ కేసులో ముందుగా ఎస్ఐని స‌స్పెండ్ చేయాలి. మా కార్య‌క‌ర్త‌లు కూడా ర‌గిలిపోతున్నారు. ఇదే దాడుల సంస్కృతి కొన‌సాగితే మేం కూడా నియంత్రించ‌లేం. ఈ సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాగే హ‌త్య రాజ‌కీయాలు కొన‌సాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టిడికి కూడా వెనుకాడం. శ్రీధ‌ర్ రెడ్డి తండ్రిని స‌ముదాయించ‌లేక‌పోతున్నాం. శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య వెనుకాల జూప‌ల్లి కృస్ణారావు ఉన్నాడ‌ని కేసు పెడితే, మంత్రి పేరు ఉప‌సంహ‌రించుకోవాల‌ని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ANN TOP 10