ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేవుడు నేరుగా పంపినట్లే భావిస్తానని చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అయితే ప్రధాని మోడీ ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తల్లి కడుపున పుట్టినట్లు భావించనని, దేవుడు నేరుగా పంపినట్లే భావిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనకు తాను సమాధానపర్చుకుంటున్ననని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యక్తిగత జీవితం గురించి అడిగిన ప్రశ్నకు మోడీ ఈ సమాధానం ఇచ్చారు.
గురువారం న్యూఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో భారత బ్లాక్ అభ్యర్థి కన్హయ్య కుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీలా సామాన్య ప్రజలు మాట్లాడితే వారిని వెంటనే మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. మోడీ అదానీ, అంబానీ కోసమే పనిచేస్తున్నారని, రుణమాఫీ, రోడ్డు, ఆస్పత్రి, విద్య, వైద్యం కోసం ఏమి పనిచేయరని విమర్శించారు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకర్యంగా ఉంటాయని, ఇండియా కూటమి గెలువబోతుందని ధీమాను వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 7 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. మోడీ రాజ్యాంగం, రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.