– మరో 86 మంది బ్లడ్ శాంపిల్స్లోనూ డ్రగ్స్ ఆనవాళ్లు
– బెంగళూరు రేవ్ పార్టీలో కీలక అంశాలు వెలుగులోకి..
(అమ్మన్యూస్, బెంగళూరు):
నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో తొలుత తాను అసలు లేనంటూ హేమ వీడియో విడుదల చేశారు. దీనికి భిన్నంగా హేమ పార్టీలో ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు ఆధారాలు విడుదల చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం ఉంది. పలువురి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి..పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
కీలక మలుపు..
బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్స్ బృందం గుర్తించింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీమ్ సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
డ్రగ్స్ తీసుకున్న హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉన్నారు. రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని.. అసలు అందులో ఎవరున్నారో కూడా తనకి తెలియదని హేమ మొదటిగా స్పందించింది. తాను హైదరాబాద్లోనే రెండు రోజులుగా ఉన్నానని.. ఇక్కడే ఓ ఫామ్ హోస్లో ఉన్నట్లుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫొటోను కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి రేవ్ పార్టీ కేసును బెంగళూరు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.