AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘బోనస్’ అంటూ బోగస్ మాటలు చెప్పొద్దు: వినోద్ కుమార్

సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రాజ్యమంటే రైతులను మోసం చేయడమేనా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. రైతుబంధు ఇస్తారో, రైతు భరోసా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని సక్రమంగా చేయలేదన్నారు. ప్రభుత్వం పని తీరుపై ఆరు నెలల్లోనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేబినెట్ బేటీలో రైతుబంధుపై చర్చించాలని కోరారు. దేశంలోనే మొదటి సారిగా కేసీఆర్ రైతుబంధు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు కోతల సమయంలో ఇవ్వడం బాధాకరమన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చి ఆదుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్ ఇచ్చే పెట్టుబడి డబ్బులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనాలన్నారు. సన్నవడ్లకే రూ. 500ల బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

ఎన్నికలకు ముందు చెప్పితే కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చేవి కావన్నారు. రైతుబంధు పథకాన్ని మెచ్చుకుని ప్రధాని మోడీ పీఎం కిసాన్‌కు రూపకల్పన చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందురూ. 7, 700ల కోట్లు రైతుబంధు కోసం కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కావాల్సిన కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బోనస్ పేరుతో బోగస్ మాటలు మానుకోవాలని, ప్రతి రైతు దగ్గర ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నూటయాభై రోజులైనా చలనం లేదన్నారు. ప్రభుత్వం కాలయాపన చేసే పనులు చేస్తుందని, ప్రజలు, రైతులకు ఉపయోగపడే పనులు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిట్ల మీద కాకుండా ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గట్టు రామచంద్రరావు, పన్యాల భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10