ఈ ఎన్నికల్లో కేంద్రంలో తమ సర్కారు హ్యాట్రిక్ కొడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల సరళి ముగుస్తున్నా కొద్దీ ఇండియా కూటమి పేకమేడలా కూలుతోందని విమర్శించారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ.. ఈ ఎన్నికల్లో దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందన్నారు. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పారని, రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారని అన్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా.. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా అంటూ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోడీని తిట్టడమే పనిగా ఇస్తారని దుయ్యబట్టారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా అని ప్రశ్నించారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైందన్నారు.
ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగిందని, రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారని చెప్పారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. బలమైన ప్రభుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయిందని విమర్శించారు. పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఒకవేళ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే, అప్పుడు రామ్‌లల్లా మళ్లీ టెంట్‌లోకి వెళ్తారని అన్నారు. రామాలయంపై వాళ్లు బుల్డోజర్ తోలిస్తారని విమర్శించారు. యోగీజీ నుంచి వాళ్లు ట్యూషన్ తీసుకోవాలని సూచించారు. ఎక్కడ బుల్డోజర్ నడపాలి, ఎక్కడ తీయవద్దు అన్న విషయాన్ని విపక్షాలు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లకు పరివార్, వాళ్ల పవర్ ఇవే ముఖ్యమన్నారు ప్రధాని మోడీ.