– నిజామాబాద్‌లో పోటీ అంటే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే..
– బీజేపీతో బీఆర్ఎస్ పార్టీని కుదవపెట్టిన కేసీఆర్
(అమ్మన్యూస్, జగిత్యాల):
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌ను నిలువరించడాని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కుకోవడమేనని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమన్యుడినని అన్నారు. గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని.. తనను రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్పై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
‘బీజేపీ సిద్ధాంతం, ఆర్థికప్రణాళిక లేని పార్టీ. మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ. తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకం అయినా బీజేపీ పాలిత రాష్టాల్లో అమలవుతుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు దీక్షల పేరిట ధర్నాలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వరికి క్వింటల్‌కు 3వేల రూపాయల మద్దతు ధర అందిస్తాం’ అని జీవన్‌రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ దగ్గర కేసీఆర్ కుదువపెట్టారన్నారు. బీజేపీ హస్తల్లో ఉన్న పార్టీని విడిపించడానికే కేసీఆర్ రైతుదీక్షలు చేయిస్తున్నారన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేసే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నారన్నారు.