కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ అన్నారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. ఆయన వైఖరి ఆడ లేక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉద్యోగుల సహకారంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని తెలిపారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని తీవ్రంగా విమర్శించారు. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైయ్యారని మండిపడ్డారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు,..విద్యుత్ ఉద్యోగులపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి చిల్లర చేష్టలు మాని పాలనపై దృష్టిసారించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
